అవును..చేరాను...మోపెడ్ కొంటానా?

>> Tuesday, November 21, 2006

పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ఒక తమ్ముడు...'మహాదర్శి చిట్‌ఫండ్' లో చేరాడు..ఈ మధ్య తను చాలా బాధపడిపోతున్నాడు. చేరిననాడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆవగింజంతైన లేదు..తన అక్క తగు సలహా ఇస్తుందని ఆమెకు ఫోన్ చేసాడు...ఆ సంభాషణే ఇది...

తమ్ముడు: అక్కా బాగున్నావా?

అక్క : ఆ.. బాగున్నాను...అదేంటీ? అలా డల్‌గా మాట్లాడుతున్నావు?

తమ్ముడు: అవునే...ఇంతకీ నేను మోపెడ్ కొంటానా లేదా ...నువ్వన్నా చెప్పవే..

అక్క: అదేంటిరా...నిక్షేపంలా కొంటావు...అదేదో దర్శిలో చెరావుకదా..డబ్బుకూడా కడుతున్నావు...

తమ్ముడు: అదేనే...కానీ ఈమధ్య పేపర్లు, టీవీ లు చూసి పిచెక్కుతుందే...నీకుతెలుసుగా...మా బాస్ కూడా ఈ దర్శిలో చేరి సొంతంగా కారు కూడా కొన్నాడే... మొన్నొకసారి కనపడి కారెక్కమంటే...నాకు చిర్రెత్తు కొచ్చి శపధం కూడా చేసేశాను.

అక్క: ఏమనిరా...?

తమ్ముడు: నేను మహాదర్శి లో చేరతాను...మోపెడ్ కొంటాను అని..

అక్క: మరి ఇంకేమిరా....ఆ చిట్ ఫండ్ లో చేరావు...డబ్బు దాచి పెడుతున్నావు...మరి ఇప్పుడు..ఆ అనుమనము ఎందుకు వచ్చింది?

తమ్ముడు: డౌట్ రాదా మరి...పేపర్లలో ఒకాయనేమో నిబద్ధత అంటాడు, నిజయతీ అంటాడు....నిప్పులాంటిది మా నిజయతీ అంటాడు.. మరోపక్కేమో ఇంకోపెద్దాయన వాజ్యమటాడు..లెక్కలు చెప్పమంటాడు.

అక్క: అవున్రా! మీ బావగారు కూడా రోజూ పేపర్లు తిరగేస్తూ, టీవీ చూస్తూ తెగ కామెంట్లు, గంటలకొద్దీ పీకేస్తున్నారు..మీడియా మొత్తం రెడుగా చీలిపోయిందటగా..?

తమ్ముడు: అవునే.., ఒక పేపర్ తిరగేస్తే..రాముడు సత్యసంధుడిలా కనిపిస్తున్నాడు..ఆయన మాట రామబాణం అని పిస్తోంది..మరొక పేపర్ చూస్తే ఆయన మాటకు భరోసా లేదేమో అనిపిస్తోంది...

అక్క: అవున్రా...అంతా రాజకీయమంటున్నారు...

తమ్ముడు: నమ్మకం మావైపు ఉండి...తేడా పాడాలు లేని ఘన చరిత్ర మాది..అసంబద్ధ, అహేతుక ఆరోపణలు చేయడం మంచిది కాదు..అని సదరు కంపెనీ అధిపతి అంటున్నారే, రాజకీయం చేస్తున్నారు..,దురుద్దేశంతో దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు..అని ఆయన అంటుంటే...నేను అడిగింది మామూలు ప్రశ్నలే..చెబితే పోలా, ఎందుకీ అనుచిత భాషాప్రయోగాలు అని మరొకాయన వాదన...

అక్క: అవునూ., ఇద్దరూ చెరొక బహిరంగ లేఖలు వ్రాసారు కదరా...ఆరెండూ చక్కగా పక్కనపక్కన పెట్టి చదువుకోరా..ఏమన్నా అర్ధం అవుతుంది...

తమ్ముడు: అలా చేసిన నా సమస్య పరిష్కారం కావడం లేదే..!

అక్క: పోనీ, ఒక పని చేస్తే పోలా?...

తమ్ముడు: ఏమిటది.?

అక్క: నువ్వు కూడా ఓక బహిరంగ లేఖ రాసి పడేయ్. పత్రికల వాళ్ళూ, టీవీ చానెళ్ళ వాళ్ళూ బోలెడంత ప్రచారం ఇచ్చేస్తారు.

తమ్ముడు: ఏమని రాయనే..

అక్క: వెధవా ..! BA చదువుకున్నావు...అదికూడా నేనే చెప్పాలా?...పైనాన్స్ 'ఫైట్' లో ఇరుపక్షాలు ఎత్తుకు పైయెత్తులు వేసుకొంటున్నాయి. రాజ్కీయ పావులు చక చకా కదులుతున్నాయి. 'చిదంబర' రహస్యాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ఈ అర్ధిక సమరంలో ఎవరు ఎప్పుడు ఏ వ్యూహం వేస్తారో అంతుపట్టటంలేదు..చివరకు పద్మవ్యూహమో అభిమన్యునిలా 'మదుపుదారుడు' కాకూడదు.

తమ్ముడు: మదుపుదారుడా?...మధ్యలో వాడెవడే..?

అక్క: మీ బావగారు పేపర్ల భాషంతా నా చెవుల్లోకెక్కిస్తూ వుంటే...అలాంటి పదాలే వస్తాయి.నువ్వేమీ కంగారు పడకు...మదపుదారుడంటె..డిపాజిటర్ అని అర్ధమట..

తమ్ముడు: అర్ధం అయిందిలే... అంటే..డిపాజిటర్గా ఒక బహిరంగ లేఖ వ్రాయాలి అంతేకదా.

అక్క: అవును.., ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకొంటూ, మనల్ని నట్టేట ముంచుతారేమో....

తమ్ముడు: (ఆవేశంగా) అలా కానీయను., రాసేస్తాను. మధ్యలో మనమెందుకు మునిగి పోవాలి?, మనమెందుకు ఆందోళన పడాలి?, B.Pలు పెంచుకోవాలి? నేనూ మోపెడ్ కొనుక్కోవాలంటే...గగ్గోలు చేయాల్సిందే...తెగువ చూపాలసిందే..

అక్క: ఒరేయ్! అంతగా అవేశపడకు...రాస్తావ్..కానీ నీ లేఖను...ఏ పేపర్ వాళ్ళు వేస్తారు?...ఇప్పుడున్న మీదియ అంతా చెరో పక్షాన ఉండి క్షణం తీరిక లేకుండా పేజీలకు పేజీలు నిపేస్తున్నారు..టివీల్లో గంటగంటకూ చెవులు ఊదర కొట్టేస్తున్నారు... నీ గురించి ఎవ్వరు పట్టించుకొంటారురా...?

తమ్ముడు: అవును ఎవరు పట్టించుకొంటారు...?...హల్లో.. హల్లో..అక్క మాట్లాడవే ....

(లైన్ కట్ అయింది)

6 అభిప్రాయాలు:

uma November 21, 2006 11:10 am  

అనిల్,
కొంపదీసి మీరు కూడా మోపెడ్ కొందామని అనుకున్నారా ఏంటి? అక్కా తమ్ముళ్ళ సంభాషణ చాలా బాగుంది. మీ జోకులాష్టమి బ్లాగ్ ఇంకా చాలా బాగుంటుంది.

వీవెన్ November 21, 2006 12:39 pm  

అక్క: ఒరేయ్! అంతగా అవేశపడకు...రాస్తావ్..కానీ నీ లేఖను...ఏ పేపర్ వాళ్ళు వేస్తారు?...ఇప్పుడున్న మీడియా అంతా చెరో పక్షాన ఉండి క్షణం తీరిక లేకుండా పేజీలకు పేజీలు నింపేస్తున్నారు..టివీల్లో గంటగంటకూ చెవులు ఊదర కొట్టేస్తున్నారు... నీ గురించి ఎవ్వరు పట్టించుకొంటారురా...? ఎవరూ పట్టించుకోరుగానీ, నువ్వే ఓ తెలుగుబ్లాగు మొదలెట్టి అందులో రాయి.

cbrao November 21, 2006 6:52 pm  

తెలుగులో బ్లాగు రాస్తే ఏమవుతుంది? మోపెడ్ వస్తుందా?

spandana November 21, 2006 9:05 pm  

అదిరిందయ్యా అనిల్.
రామోజీ రావ్ X కాంగ్రస్ యుద్దము మాట ఎలా వున్నా అందులో మదుపుపెట్టిన మదుపుదారుల గోడు వినేవారెవ్వరు? మీరైన విన్నందుకు వాళ్ళు సంతోషిస్తారు.
సందులో సడామియా అన్నట్లు ఇందులోంచి కూడా వీవెన్ ఓ బ్లాగు పిండుకుందామనుకున్నారు, భలే చమత్కారే!
--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక November 22, 2006 1:44 am  

bhale raasaaramdi.

రానారె November 29, 2006 12:26 am  

మహాదర్శి (మార్గదర్శి) , రాముడు (రామోజీ) - భలే. ఒక 'మదుపుదారు'ని మది మధనం మహగొప్పగా అందించారు.
పోయినవారం కొంత చదివి, పనుండి వెళ్లిపోయాను. తరువాత కూడలిలో ఇది అడుగున చేరిపోయింది. మళ్లీ ఈ రోజు పట్టుకున్నాను.