కొద్ది కాలం క్రిందట దోమల రాజ్యం లో "మహానాడు" జరిగింది.
కుర్ర దోమలు, ముసలి(పెద్ద)దోమలపై విరుచుకుపడ్డాయి -"ఇంతకాలం TRS కాంగ్రెస్సు తో కలసి ఉన్నట్లుగా, మీరు ఆ మనుష్యులతో కలసి ఉన్నారే, ఎప్పుడైనా ఆ మనుష్యులు మిమ్మల్ను పట్టించుకున్నారా?, ఎప్పుడూ చంద్రశేఖర రావుని చూసినట్లు (పురుగుని చూసినట్లు) చూసేవారుకాదా?, మిమ్మలని వాళ్ళ మీడియ ఎప్పుడైన మొదటి పేజీ లో కవర్ చేసిందా?- అని.
ఓ పెద్ద దోమ నచ్చచెప్పబోయింది..చూడు మనుష్యులన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి., వాళ్ళలో వాళ్ళకే అనేక సమస్యలు.. సాగునీటి కుంభకోణానికి విలువ ఇవ్వాలంటాడు ఒక సబ్ ఎడిటరు..,కాదు తాగునీటి కుభకోణానికి అంటాడు మరొకడు.. పోనీ ఎడిటర్ గారు తెగించి ఎదో ఒకటి పెట్టేద్దామంటె పైన సూపర్ ఎడిటర్ Y.S గారి చివాట్లు తప్పవు. ఏ ఫాంట్ లో వేయాలో, ఎక్కడ వేయాలో ఆయనగారి చేత పాటలు తప్పవు..ఈ సంబరంలో, మన మీద వార్త వ్రాయడమే అబ్బురం., పైగా హెడ్‌లైన్స్ లో కావాలనుకోవడం మరీ విడ్డురం.
ఏం? ప్రాజెక్టుల గురించి, హౌసింగ్ స్కాముల గురించి, కాందీశీకుల భూమి గురించి, తెలుగు బాషా పరపతి గురించి, రింగురోడ్ల గురించి., ఇలా అన్నిటి గురించీ వ్రాస్తున్నారుగా..మన గురించి వ్రాయడానికేమైంది? - అని సణిగిందో యువత.
"అవన్నీ సాధారణ ప్రజలను ఆర్ధికంగా బాధించి, నష్టపెట్టేవి., అందుకని వాటి గురించి పట్టించుకుంటారు."..పెద్దరింకంతో నచ్చ చెప్పబోయిందో ముదుసలి.
"ఓహొ! మనం మాత్రం కోన్‌కిస్కా గాళ్ళమా?, మన వలన హెల్త్ పోతుంది కదా..'హెల్త్ ఈజ్ వెల్త్' కాబట్టి వాళ్ళకి వెల్త్ కూడా పోయినట్లే"...అంది ఇంగ్లీషు మీడియం లో చదువుకోని., బ్రిటీషు లైబ్రరీ లో సభ్యత్వము తీసుకొన్న ఒక BPO దోమ.
ఈ భాగ్యానికే ఇంగ్లీషు కొటేషన్ ఎందుకు..."ఆరోగ్యమే మాహా భాగ్యం" అనొచ్చుగా అందో ప్రభుత్వ గ్రంధాలయములో స్థిర నివాసము ఏర్పరచుకొన్న లావుపాటి దోమ..(తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళేవారు లేకపోవడము వలన పుస్తకామీద ఉన్న దుమ్మును కూడా దులపక నిద్రపోతున్నాడు లైబ్రేరియన్, అందువలన బద్దకించి దోమలు కూడా అక్కడనే నివాసము ఏర్పరచుకొని ఎగరడము కూడా మర్చిపోయాయి).
"ఆ మన వలన మనుషులకు పోయె ఆరోగ్యం ఎంతలే.. ఐనా మన రాతను, భారత దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు"..అందో విదేశాలకు వెళ్ళోచ్చిన ప్రవాస దోమ.
అయినా ఈ మస్కిటో కాయిల్సు, ఆలౌట్లు వెలిగించి మనమంటే ఖాతరు లేకుండా ఉన్నారు, సన్నాసి ఎదవులు అని అరిచాడు నరేంద్ర ని కుట్టొచిన దోమగాడు.
ఆ రోజులే వేరు, మనకోసం దోమతెరలు కుట్టించేవారు, దాని కోసం రాతాలు, పందిరి మంచాలు తయారు చేయించేవారు..ఇప్పుడేముంది?., చిన్న స్విచ్ వేస్తే చాలు సన్నని పొగ రావటం, దెబ్బకి దోమలు చచ్చినట్లు టీవి లొ యాడ్స్ - అంతా పోయేకాలం అని గొణిగింది, గాంధీ కాలంనాటి దోమ.
"ఠాఠ్! నేనొప్పుకోను" అని అరిచిందో యువ దోమ. " ఇలా ఐతే మన పరువేమి గాను? మనల్ని ఉత్తి అల్పప్రాణులనుకోరూ?"
"అల్పప్రాణివి కాకపోతె పెద్ద..పులివా? లేక బలా సాహెబ్వి అని అనుకుంటున్నావా? మనల్ని చీమా, దోమా అని తీసిపారేస్తారు. ప్రాస కుదిరిందనే కాదు, ఆకారంలో ఇంచుమించు ఒకటే అనికాదు, చీమకాటుకి ఎంత విలువో దోమకాటుకి అంతే విలువ అని తాత్పర్యం!" బోధపరిచంది అధ్యక్ష స్థానములో ఉన్న ముసలిదోమ.
"కామ్రేడ్స్! చీమకాటుకి, దోమకాటుకీ ఉన్న తేడా చాటిచెబుదాం, ఎప్పటికైనా దోమలంటె మనుష్యులు భయపడేట్లు చేద్దాం, పోరాడితే పోయేదేమీలేదు ఈ అల్పప్రాణులనే పేరు తప్ప.." అని ముక్తకంఠం తో అరిచాయి విరసం, సరసం, నీరసం ( ఇవి కమ్యూనిస్టు గుంపులు) సభ్యులైన యువ దోమలు.
దీనితో హెడ్‌లైన్స్‌కెక్కుతారని భ్రమ పడుతున్నారా?., ప్రశ్నిచిందో పండు దోమ.
"బద్‌నాం భీతొ నాం హై" అన్నారు మీలాంటి పెద్దలే! ఈనాటి పేపర్లో హెడ్‌లైన్స్ ఏమిటి? యాక్సిడెంట్లు, అవినీతి చర్యలు - ఇవేగా! రాష్ట్రపతి ప్రసంగమైనా క్రింద వేయడమే! ఇక నోబుల్ ప్రైజ్ న్యూసైతే ఎక్కడో లోపలి పేజీలలో వేస్తున్నారు! మనము హెడ్‌లైన్స్ కెక్కాలంటే ఎదో వెధవ పని చేయాలంతే! నేటి నుండి మా సమరం ప్రారంభం!" అన్నాడు మంచి ఊపు మీద ఉన్న ఒక కుర్రదోమ, అంతే అంతలో మంచి కత్తిని, ఒక రంగు రంగుల తలపాగానీ బహూకరించి 'జై' అన్నాయి మిగిలిన కుర్రదోమలు.
ఇక అప్పటినుండి దోమలసేన ఘటోత్కచుడి సేనలా ద్విగుణం, బహుళం ఇంది. శాంతి చర్చల తరువాత మావోయిస్టుల్లా అనేకమంది కొత్తవాళ్ళను రిక్రూట్ చేసుకొన్నాయి. ముక్కుతో రాకెట్‌లాంచర్లా నేరుగా ఎలా ఎటాక్ చేయాలో నేపాల్ వాళ్ళ సహాయంతో వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మునిసిపాలిటి వారికి లంచాలించి మురుగ్గుంటలు యిబ్బడిముబ్బడిగా పెరిగేట్లు చూసారు.
ఇక చూస్కొండి, ఎక్కడ చూసినా దోమలే! బోల్డు బోల్డు జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, హై టెంపరేచర్లు. ఈసారి జరిగిన సమావేశంలో కుర్రదోమలు బోర విరుచుకున్నాయి - "చూశారా, మా ప్రతాపం. అందరూ మమ్మల్ని తలుచుకొనేవారె!" అని.
పెద్ద దోమలు పగలబడి నవ్వాయి - ఏడిసినట్లు ఉంది. కష్టమంతా మనది, పేరు ఇం'కోళ్ళ్'ది. ఆ కీళ్ళనొప్పుల వ్యాధికి చికెన్‌గున్యా అని పేరు పెట్టారు. చికెన్ వల్లనే వస్తోందనుకొని కోళ్ళు తినడం మానేశారు. మన ప్రజ్ఞేం తెలిసింది? మనుష్యులకు కోళ్ళంటే భయం పట్టుకొంది కానీ మనమంటే కాదు అని ఎద్దేవా చేశాయి.
"పోనీ ఎదో విధంగా ప్రతిపక్షాలు అల్లరి చేయడానికి అవకాశం ఇచ్చాంగా" అని సమర్ధించుకోబోయాయి కుర్రదోమలు.
"అదంతా వాళ్ళ కుట్ర! రోగాలు లేవు, ఏమీలేవు, అదంతా 'మిత్' అని కొట్టిపారేశాడు ఆరోగ్యమత్రి" అంది చిరాగ్గా BPO దోమ.
"మిత్ అనే బదులు దానికి దగ్గరగా ఉన్న మిధ్య అనే పదం వాడవచ్చుగా" అంది తెలుగు సంఘాలవాళ్ళను కుట్టిన దోమ కోపంగా.(ముఖ్యంగా అనిల్ చీమలమఱ్ఱి ని)(ఇదే దోమ, గ్రంధాలయం లోని దోమ అని గ్రహించగలరు).
"మాయంటావూ, మిధ్యంటావూ" అంటూ శ్రీశ్రీ గేయం ఆలపిస్తూ ఓకుర్రదోమ సమావేశం అవుతుండగానే సరాసరి ఆరోగ్యమంత్రి ఇంటిమీదకి దాడికెళ్ళింది.
కానీ ఆయన ఓపట్టన చలించే ఘటం కాదు. 'నేను డాక్టర్ని కాను, మాఇంట్లో జ్వరం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ దీనికి కారణం అపరిశుభ్ర పరిసరాలనీ, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అనడం, ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యం మాత్రమే!, ఇది ప్రతిపక్షాల కుట్ర." అని వాదించాడు.
దోమల వలన జనాలు ఛస్తున్నారని వీళ్లనడం, కాదని ప్రభుత్వం వారు వాదించడం, దానాదీనా దోమలకు రావలసినంత ఖ్యాతి రాకపోవడం జరిగింది.
కుర్రదోమలు విడిగా సమావేశమయ్యాయి. కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలన్న నిర్ణయం జరిగింది. వేస్తే గీస్తే చంద్రశేఖరరావులా ఢిల్లీలోనే పాగా వేయాలని నిశ్చయించారు. ఇరవై మది సభులతో ఆత్మాహుతి దళం ఏర్పాటయింది. హై సెక్యూరిటీ ఉన్న ప్రధనమంత్రి ఇంటిపైననే దాడికి వెళ్ళాలని నిశ్చయించాయి పాలిట్‌బ్యూరో. భగత్‌సింగ్ ఏకంగా పార్లమెంటులో బాంబులు వేయడం చేతనే అందరి దృష్టినీ కర్షించాడనీ, అల్లూరి సీతారామరాజు మద్రాసు అసెంబ్లీ మీద బాణాలేయకపోవడం వల్లనే సరైన ఫోటో కుడా లేకుండా చరిత్రలో మరుగున పడ్డాడని దృష్టాంతాలు వల్లేవేయడం జరిగింది.
ఆత్మాహుతి దళం కదిలింది. ప్రధాని మనుమలు రోగాన పడ్డారు. డెంగ్యూ వ్యాధి అనేది ఉందని, దానివలన ప్రజలు మరణించే ప్రమాదం ఉందని ఎట్టకేలకు అధికారికంగ ప్రభుత్వం ఒప్పుకుంది. దోమల గురించి అన్ని పత్రికలూ మెయిన్ బ్యానర్ హెడ్‌లైన్స్ ఇచ్చాయ్.
దోమల రాజ్యం లో ప్రస్తుతం విజయోత్సవాలు జరుగుతున్నాయి.
Read more...